స్వచ్ఛతకు స్వయంగా రంగంలోకి అధికార యంత్రాంగం –అమీన్‌పూర్‌లో స్పెషల్ డ్రైవ్.

తేది:02-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డి జిల్లా,అమీన్‌పూర్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ సానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ భోర్ఖడే హేమంత్ సహదేయోరావు మరియు అమీన్‌పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి. ప్రదీప్ కుమార్ పాల్గొని, బిరంగూడ మరియు అమీన్‌పూర్ డివిజన్‌లలోని పార్కులను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య పనులను వారు నిశితంగా పరిశీలించి, పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు.
పార్కులు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే ప్రదేశాలుగా ఉండాలన్న ఉద్దేశంతో, చెత్త నిల్వలు లేకుండా శుభ్రతను కాపాడాలని, రోజువారీ పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మరిన్ని చెట్లను నాటించి హరిత వాతావరణాన్ని పెంపొందించాలని సూచించారు.
స్వచ్ఛత కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని అధికారులు పేర్కొన్నారు. కాలనీ వాసులు స్వచ్ఛత పరిరక్షణలో సహకరించాలని, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని కోరారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో డీఈఈ వెంకటరమణ, కార్యాలయ సిబ్బంది, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు. అమీన్‌పూర్ సర్కిల్‌ను మరింత శుభ్రంగా, పచ్చగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్‌లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *