బొల్లారం భద్రతను తాకట్టు పెట్టారా? పోలీస్ స్టేషన్ రద్దుపై ప్రజల ఆగ్రహం.

తేది:02-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డి జిల్లా, బొల్లారం: 40 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బొల్లారం పోలీస్ స్టేషన్‌ను రద్దు చేసి, అమీన్‌పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో విలీనం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) శ్రేణులు బొల్లారం జిహెచ్ఎంసీ డివిజన్–272 పరిధిలోని గాంధీ బొమ్మ సమీపంలో భారీ నిరసన ధర్నా నిర్వహించారు.
శుక్రవారం రోజున జిన్నారం జెడ్పిటిసి కొలన్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్‌ను తొలగించడం ప్రజల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది పూర్తిగా అన్యాయమైన నిర్ణయమని వారు పేర్కొన్నారు.
బొల్లారం ప్రాంతంలో సుమారు 25 వరకు కాలనీలు, 70 వేలకుపైగా జనాభా, 350కు పైగా పరిశ్రమలు ఉన్నాయని నాయకులు వివరించారు. అలాంటి ప్రాంతాన్ని పోలీస్ స్టేషన్ లేకుండా చేయడం వల్ల నేరాలు పెరిగే ప్రమాదం ఉందని, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం పోలీస్ సంబంధిత పనుల కోసం అమీన్‌పూర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని విమర్శించారు.
ఈ ప్రాంతంలో 80 శాతానికి పైగా వలస కుటుంబాలు నివసిస్తున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని బిఆర్ఎస్ నాయకులు గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా పోలీస్ స్టేషన్ లేకపోవడం వల్ల భద్రతా లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, ఐడిఏ బొల్లారం పరిధిలో పోలీస్ స్టేషన్‌ను తిరిగి పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో జిన్నారం మాజీ ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి, బొల్లారం మాజీ కౌన్సిలర్లు వి. వేణుపాల్ రెడ్డి, టీ. సాయి కిరణ్ రెడ్డి, బీరప్ప యాదవ్, సతీష్, శ్రీకాంత్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు బి. జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రత్నం, యాదగిరి, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *