కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్: రూ. 35.19 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మంజూరు చేసిన రూ. 35.19 కోట్ల నిధులతో నిర్మించనున్న ‘దీక్షా విరమణ మండపం’, ’96 గదుల విశ్రాంతి సత్రం’ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. శనివారం ఉదయం 10:30 నుండి 11:30 గంటల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతాయని జనసేన పార్టీ వెల్లడించింది.

గతంలో ఎన్నికల విజయం అనంతరం కొండగట్టును సందర్శించిన సమయంలో, భక్తులు ఎదుర్కొంటున్న వసతి ఇబ్బందులను పవన్ కళ్యాణ్ గుర్తించారు. దీనిపై వెంటనే స్పందించి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి TTD ద్వారా నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. ఈ నిధులతో ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్ష విరమించేలా అత్యాధునిక మండపాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తో పాటు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా పాల్గొంటారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం పవన్ కళ్యాణ్ రాజకీయ సమావేశాల్లో పాల్గొంటారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో తెలంగాణ జనసేన పార్టీ నాయకులు, శ్రేణులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో విజయం సాధించిన ప్రతినిధులను ఆయన అభినందిస్తారు. ఈ సమావేశం కోసం జనసేన పార్టీ శ్రేణులకు ప్రత్యేక ఎంట్రీ పాసులను జారీ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *