యూట్యూబర్ అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో గరికపాటి నరసింహారావు సోషల్ మీడియా బాధ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక నేరస్థుడికి చట్టపరమైన శిక్ష పడితే అతను మారతాడో లేదో చెప్పలేం కానీ, పది మంది కలిసి అతడిని ఈసడించుకుంటే (సామాజిక విమర్శ) మాత్రం పది రోజుల్లోనే మారుతాడని ఆయన పేర్కొన్నారు. సమాజంలో తప్పు చేసిన వారిని చూసి మౌనంగా ఉండటం వల్ల వారు మరింత రెచ్చిపోతారని, అందుకే అడ్డు అదుపు లేకుండా మాట్లాడే వారిని ప్రశ్నించే ధైర్యం ఉండాలని పిలుపునిచ్చారు.
సమాజంలో వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి (Personality Assassination) పాల్పడే వారిపై జనం స్పందించాలని గరికపాటి సూచించారు. “మనకెందుకులే” అని వదిలేయడం వల్లే ఇలాంటి వారు ఇష్టం వచ్చినట్లు బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తన విషయంలో మాత్రం అభిమానులు ఎప్పుడూ మౌనంగా ఉండలేదని, ఏదైనా తప్పు అనిపిస్తే వెంటనే స్పందిస్తూ ధర్మానికి అండగా నిలబడుతున్నారని ఆయన కొనియాడారు. సోషల్ మీడియా వేదికల్లో సంస్కారవంతులదే పైచేయి కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇటీవల అన్వేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల అతని ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గడమే కాకుండా, పోలీసులకు కూడా ఫిర్యాదులు అందాయి. ఈ పరిణామాల తర్వాత అతను బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ, గరికపాటి వంటి పెద్దలు ఈ అంశంపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది. నైతిక విలువలను కాపాడటంలో సమాజం పోషించే పాత్ర శిక్ష కంటే శక్తివంతమైనదని గరికపాటి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.