పెందుర్తి ప్రాంతానికి చెందిన కె. రూపవతి (25) ప్రసవ వేదనతో మంగళవారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. స్కానింగ్ లో శిశువు బరువు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, ప్రసవ సమయంలో ఎదురయ్యే సవాళ్లను ముందే ఊహించారు. శిశువు తల బయటకు వచ్చినప్పటికీ, అధిక బరువు కారణంగా భుజాలు ఇరుక్కుపోవడంతో (షోల్డర్ డిస్టోసియా) తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సామాన్యంగా సిజేరియన్ వైపు వెళ్తారు, కానీ అనకాపల్లి వైద్యులు ‘వుడ్స్ కార్క్ స్క్రూ’ అనే ప్రత్యేక వైద్య పద్ధతిని పాటించి సుమారు 4 గంటల పాటు శ్రమించి సుఖ ప్రసవం చేశారు.
ఈ అరుదైన ఘనత సాధించిన డాక్టర్ సౌజన్య, పీజీ విద్యార్థిని డాక్టర్ మానస, స్టాఫ్ నర్సులు జగదీశ్వరి, జే.కుమారి, ఏఎన్‌ఎం సరస్వతి బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. అధిక బరువు ఉన్న శిశువులను ‘మాక్రోసోమియా’ కేసుగా పరిగణిస్తారు. ఇలాంటి సమయంలో తల్లికి రక్తస్రావం కావడం లేదా బిడ్డకు ఊపిరి అందకపోవడం వంటి రిస్కులు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఎటువంటి ప్రాణాపాయం లేకుండా తల్లిని, బిడ్డను క్షేమంగా కాపాడటంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమయ్యే ఇలాంటి క్లిష్టమైన ప్రసవాలను జిల్లా ఆసుపత్రిలో నిర్వహించడం పేద ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. అనకాపల్లి ఆసుపత్రిలో ప్రస్తుతం 70% వరకు సహజ ప్రసవాలు జరుగుతున్నాయని, నూతన సంవత్సరంలోనూ వైద్యులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.