కడప శివారు ప్రాంతమైన చలమారెడ్డిపల్లెలో నివాసముంటున్న కిరణ్ కుమార్, మంజుల ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కిరణ్ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే, ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ అవసరాల కోసం కిరణ్ తన స్కూటీని తాకట్టు పెట్టారు. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవ జరిగింది. తన మాట వినకుండా స్కూటీని తాకట్టు పెట్టారన్న మనస్తాపంతో మంజుల మంగళవారం ఉదయం తన ఇద్దరు పిల్లల ముందే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విషాదంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆత్మహత్య జరిగిన సమయంలో కిరణ్ కుమార్ ఇంటి వద్ద లేరు. ఆయన తన భార్యకు ఫోన్ చేయగా, ఆరేళ్ల కుమారుడు ఫోన్ ఎత్తాడు. “అమ్మ ఏం చేస్తోందిరా?” అని కిరణ్ ప్రశ్నించగా, ఆ పసివాడు వెక్కివెక్కి ఏడుస్తూ వీడియో కాల్‌లో ఫ్యానుకు వేలాడుతున్న తల్లిని చూపించాడు. ఆ దృశ్యం చూసి నిర్ఘాంతపోయిన కిరణ్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నప్పటికీ, అప్పటికే మంజుల ప్రాణాలు విడిచారు. తల్లి చనిపోయిందని కూడా తెలియని స్థితిలో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులు విగతజీవిగా పడి ఉన్న తల్లిని చూస్తూ ఉండిపోవడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు పసిపిల్లల భవిష్యత్తును ఎలా బుగ్గిపాలు చేస్తాయనడానికి ఈ ఘటనే నిదర్శనమని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్యోన్యంగా ఉండాల్సిన కుటుంబంలో ఆర్థిక కష్టాలు చిచ్చుపెట్టి, చివరకు ఆ చిన్నారులకు తల్లిప్రేమను దూరం చేశాయి.