బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం- జిల్లా ఎస్పీ స్పష్టం,బాల కార్మికులను నియమిస్తే కఠిన చర్యలు.

తేదీ:30-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఈ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా చిన్న వయసులోనే పనులకు నెట్టబడుతున్న పిల్లలను గుర్తించి, వారిని సురక్షితంగా రక్షించి బాల సంక్షేమ శాఖల సహకారంతో పునరావాసం కల్పిస్తున్నారు.
పిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేసే బాల కార్మికత్వాన్ని ఏ మాత్రం సహించబోమని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ స్పష్టం చేశారు. బాల కార్మికులను పనిలో నియమించిన యజమానులపై బాల కార్మిక చట్టాల ప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమలు, వర్క్ షాపులు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్తించిన పిల్లలను వెంటనే పనుల నుంచి విముక్తి చేసి, వారి కుటుంబాలకు కౌన్సెలింగ్ అందించి, మళ్లీ బాల కార్మికత్వంలోకి వెళ్లకుండా పర్యవేక్షణ చేపడుతున్నారు.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో ప్రజల సహకారం అత్యంత అవసరమని ఎస్పీ తెలిపారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు సమాచారం అందించాలని కోరారు. చిన్నారి ఒక్కరి రక్షణే సమాజానికి వెలుగు అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *