
తేదీ: 29-12-2025 TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా:పటాన్చెరు: ఈ రోజుల్లో చదువుతో పాటు ఆరోగ్యమే నిజమైన సంపద అని, అది క్రీడల ద్వారానే సాధ్యమవుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుంచే క్రీడలను జీవితంలో భాగం చేసుకుంటే శారీరక దారుఢ్యంతో పాటు మానసిక సమతుల్యత, క్రమశిక్షణ పెరుగుతాయన్నారు.
మున్సిపల్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ ఎనక్లేవ్ కాలనీ, ఆర్టీసీ సువర్ణ వ్యాలీ కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ పోటీలను ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం స్వయంగా బ్యాట్ పట్టి మైదానంలోకి దిగడం ద్వారా క్రీడల ప్రాముఖ్యతను చేతలతోనే చూపించారు. ఆయనతో కలిసి ఆడిన క్రీడాకారులు, యువతలో ఉత్సాహం రెట్టింపైంది. తల్లిదండ్రులు పిల్లలను కేవలం మార్కులకే పరిమితం చేయకుండా, మైదానాలవైపు నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాలనీల్లో ఇలాంటి క్రీడా వేదికలు ఏర్పడితే యువతలో ఆరోగ్యకరమైన పోటీతో పాటు సామాజిక ఐక్యత పెరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్ మహాదేవ్ రెడ్డి, కల్పన ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు శేఖర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.