రాయేదో.. రత్నమేదో ప్రజలు చూసి ఓటేయాలి : సీఎం కేసీఆర్.

ఎన్నికల్లో ఓటు వేసేముందు పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారి పార్టీలను, వారి చరిత్రను చూడాలని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను కోరారు. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఓటును వివేకంతో ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. షాద్‌నగర్‌లో నిర్వహించిన బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు.

 

సభలో ఆయన మాట్లాడుతూ.. మంచివాళ్లకు ఓటేస్తేనే మంచి ప్రభుత్వం వస్తుందని, నియోజకవర్గం కోసం ఎవరు పనిచేస్తారు? అందుబాటులో ఎవరుంటారు? అనే విషయాలను ప్రజలు ఆలోచించాలని సూచించారు. 2005 సంవత్సరంలో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఇవ్వలేదు. ‘కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని పోరాడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు. అసలు ఉన్న తెలంగాణను 1956లో కాంగ్రెస్‌ పార్టీ ఊడగొట్టిందని చెప్పారు .

 

ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తెస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. అసలు ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప ఏమీ లేవన్నారు. ఇందిరమ్మ పాలన బాగుంటే మరి ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2కే కిలో బియ్యం ఎందుకిచ్చారు? అని ప్రశ్నించారు. పదేళ్ల క్రితం వరకు తెలంగాణ ఎట్లుందో.. ఇప్పుడెట్లుందో ప్రజలు గమనించాలని కేసీఆర్‌ చెప్పారు.

 

తెలంగాణను ఆంధ్రలో కలపడం వల్ల 50 ఏళ్లు అభివృద్ధి వెనక్కి పోయిందని అన్నారు. ఏన్నో కష్టాలు పడి.. పోరాడితే 2004లో తెలంగాణ ప్రకటించారని.. తాను తిరిగి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నాక కాంగ్రెస్‌ పార్టీ దిగివచ్చి 2014లో తెలంగాణను ఇచ్చారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చాక ఈ పదేళ్లు ఎంతో అభివృద్ధి సాధించామని.. అనేక రంగాల్లో ఇవాళ తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఈసారి ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. రాయేదో.. రత్నమేదో చూసి ఓటేయాలన్నారు.

 

బిఆర్ఎస్‌ను గెలిపిస్తే.. రైతుబంధును రూ.16వేలకు పెంచుతామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ వల్ల ప్రజల భూములు భద్రంగా ఉన్నాయని.. భూరికార్డులను రైతుల వేలిముద్ర లేకుండా సీఎం కూడా మార్చలేరని కేసీఆర్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *