న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది కుల్దీప్ సింగ్ సెంగార్ కుమార్తె డాక్టర్ ఇషిత సెంగార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసిన లేఖలో న్యాయవ్యవస్థపై తమకున్న నమ్మకం సన్నగిల్లుతోందని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం వేచి చూస్తున్నామని, తమ తండ్రి బీజేపీ ఎమ్మెల్యే కావడమే తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనను రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఈ ద్వేషం తనను మానసికంగా కుంగదీస్తోందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. నిజం చెప్పడానికి ఆర్భాటం అవసరం లేదని భావించి మౌనంగా ఉన్నామని, కానీ ఆ మౌనమే తమ గౌరవాన్ని, ఆర్థిక స్థితిని దెబ్బతీసిందని వాపోయారు.
వ్యవస్థల ఒత్తిడిపై ప్రశ్నలు తమ వాదనలో బలం లేకనో ఆధారాలు లేకనో కాదని, తమ దగ్గరున్న నిజం కొందరికి ఇబ్బందికరంగా మారడం వల్లే తమను అణచివేస్తున్నారని ఇషిత ఆరోపించారు. “న్యాయమూర్తులు, జర్నలిస్టులు, సామాన్య ప్రజలు కూడా మౌనంగా ఉండేలా ఒక రకమైన భయాన్ని సృష్టించారు” అని ఆమె నిలదీశారు. తాము ఎలాంటి ప్రత్యేక రాయితీలు కోరడం లేదని, కేవలం మానవులుగా న్యాయం కోరుతున్నామని, చట్టం ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆధారాలను పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాజకీయ ముద్ర వేసి తమ ఉనికిని గుర్తించకపోవడం అన్యాయమని ఆమె లేఖలో పేర్కొన్నారు.
లీగల్ టీమ్ వాదనలు సెంగార్ మరో కుమార్తె, ఆయన లీగల్ టీమ్‌లో సభ్యురాలైన ఐశ్వర్య సెంగార్ మాట్లాడుతూ.. మెరిట్స్ ఆధారంగా వాదనలు వినిపించే అవకాశం తమకు దక్కలేదని అన్నారు. బాధితురాలు తన స్టేట్‌మెంట్‌ను పలుమార్లు మార్చిందని, ఆమె వయస్సుపై ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సంఘటన జరిగినట్లు చెబుతున్న సమయంలో సీడీఆర్ (CDR) రికార్డుల ప్రకారం నిందితుడు అక్కడ లేడని, బాధితురాలు స్వయంగా ఫోన్ లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. కాగా, బాధితురాలు మాత్రం సెంగార్‌కు ఉరిశిక్ష పడే వరకు పోరాడుతానని శపథం చేశారు.