వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ఫోటోలు, పేర్లు మరియు వాయిస్‌లను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఈ-కామర్స్ వెబ్సైట్లు అనుమతి లేకుండా వాడుకుంటూ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయి. దీనిని అరికట్టాలని కోరుతూ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన ‘పర్సనాలిటీ రైట్స్’ (Personality Rights) ఉపయోగించకూడదని రక్షణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తూ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
లీగల్ టీమ్‌కు కృతజ్ఞతలు ఈ తీర్పు వెలువడిన అనంతరం ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ పోరాటంలో తనకు అండగా నిలిచిన సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా డాకర్ మరియు రైట్స్ & మార్క్స్ బృందం ప్రతినిధి రాజేందర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. “నా వ్యక్తిత్వ హక్కులను గౌరవిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతోషంగా ఉన్నాను. మీ స్థిరమైన మద్దతుకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అని ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు.
డిజిటల్ అస్తిత్వానికి రక్షణ ప్రస్తుత కాలంలో ఏఐ (AI) వంటి సాంకేతికతలతో నటుల గుర్తింపును దుర్వినియోగం చేస్తున్న తరుణంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి వారు కూడా ఇలాంటి హక్కుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే బాటలో నడిచి తన డిజిటల్ అస్తిత్వానికి చట్టపరమైన రక్షణ పొందారు. దీనివల్ల ఆయన ఇమేజ్ను అక్రమంగా వాడుకుని లాభపడే వెబ్సైట్లు మరియు సంస్థలకు అడ్డుకట్ట పడనుంది.