తేదీ: 29-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు
గంభీరావుపేట: డబ్బు ఓడింది ప్రజాస్వామ్యం గెలిచింది
గంభీరావుపేట తీర్పు, గంభీరావుపేట గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి పద్మ గౌడ్ 2218 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ, గ్రామ ప్రజలు పార్టీ రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థికే మద్దతు ఇవ్వడం విశేషంగా నిలిచింది.
ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థులు ప్రచారానికి సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం ఉండగా, ఇండిపెండెంట్ అభ్యర్థి పద్మ గౌడ్ మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రచారానికి ఖర్చు చేయకుండా ప్రజల నమ్మకం, స్థానిక మద్దతుతో విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితం గ్రామస్థాయిలో పెరుగుతున్న రాజకీయ అవగాహనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
డబ్బు ప్రభావం లేకుండా వచ్చిన ఈ విజయం ప్రజాస్వామ్యానికి కొత్త దిశను సూచిస్తోందని, ప్రజలే పాలనకు అసలైన బలం అన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తోందని వారు పేర్కొన్నారు.
ఈ ఫలితానికి Justice Movement of India (JMI) చేపట్టిన ప్రజాస్వామ్య అవగాహన కార్యక్రమాలు, నైతిక రాజకీయాలపై నిర్వహించిన ప్రచారం కీలకంగా దోహదపడినట్లు గ్రామస్తులు తెలిపారు. డబ్బు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య చైతన్యం గ్రామంలో బలపడిందని పేర్కొన్నారు.
ఎన్నికల అనంతరం ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో JMI ప్రతినిధులు మరియు గంభీరావుపేట గ్రామ ప్రజాప్రతినిధుల బృందం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పద్మ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, స్థానిక సమస్యలు, గ్రామ పాలనలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై సంక్షిప్తంగా చర్చలు జరిపారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి, నరేందర్, సురేష్, రాము చాతరాజు, ఇల్లేష్ యాదవ్, కమలాకర్, పరుశురాములు, యాదగిరి తదితరులు మరియు గ్రామ యువత పాల్గొన్నారు. గ్రామంలో ప్రజాస్వామ్య చైతన్యాన్ని బలోపేతం చేసే సన్మాన కార్యక్రమం ఖర్చుల్లేకుండా నిర్వహించినట్లు JMI తన పత్రిక ప్రకటనలో తెలిపింది.