తేదీ 29-12-2025, జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గంలో ఇటీవలే జరిగిన గ్రామపంచాయతీ మొదటి, రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధిస్తే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ వాంకుడోత్ నరేందర్ పవార్ లతో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ల సహకారంతో ప్రజా ప్రభుత్వం పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేకనే దిగజారుడు విమర్శలకు రాజకీయాలకు పాల్పడుచున్నారని ఆరోపించారు. మోసపూరిత రాజకీయాలను మానుకొని విలువలతో కూడిన రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని అన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో గల మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు విజయం సాధించారని, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థుల విజయాన్ని బిఆర్ఎస్ పార్టీ విజయంగా భావించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలిపారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులతో, నాయకులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుమ్మక్కై చీకటి ఒప్పందంతో కాంగ్రెస్ తిరుగుబాటు సర్పంచులు గా విజయం సాధించారని విమర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో దోస్తీ చేసిన కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులను ప్రోత్సహించిన నాయకుల బండారం సర్పంచ్ ఎన్నికల తర్వాత బయటపడిందని తెలిపారు. మాజీ మంత్రి దయాకర్ రావు, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులను ప్రోత్సహించిన నాయకుల మాయ మాటలను నమ్మే పరిస్థితిలో తొర్రూరు మండలం తో పాటు నియోజకవర్గ మండల ప్రజలు లేరని స్పష్టం చేశారు. అబద్దాలకు కేరాఫ్ బి ఆర్ ఎస్ పార్టీ అని ఆరోపించారు. ప్రజలను మోసం చేసి, అబద్దాలను నిజం చేయాలని ప్రయత్నించినప్పటికీ 2023 శాసనసభ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారని విమర్శించారు. అయినప్పటికీ తీరు మారలేదని అన్నారు. స్థానిక సంస్థలు వ్యక్తిగతానికి దోహదపడ తాయని, రాబోవు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో ఎవరి తడాఖా ఏంటో చూసుకుందా మని స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 165 మంది విజయం సాధించారని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా అవతరించిందని స్పష్టం చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 2023 శాసనసభ ఎన్నికలతో నియోజకవర్గ ప్రజలకు విముక్తి కలిగిందని తెలిపారు. దిగజారుడు రాజకీయాలకు స్వస్తి పలికి విలువలతో కూడిన రాజకీయాలను రాబోవు తరాలకు అందించేందుకు, స్ఫూర్తిగా ఉండేందుకు ముందుకు సాగాలని బిఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ మాజీ సభ్యులు ఎండి మదర్, సర్పంచులు కారుబోతుల శ్రీనివాస్ గౌడ్, గాదరి కుమారస్వామి, ముసుకు సుధాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ పశులాది యాకయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాదాసు హరీష్ గౌడ్, సేవాదళ్ రాష్ట్ర నాయకులు గుగ్గిళ్ళ ఆదినారాయణ, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి సలీం లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.