పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి-సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.40 లక్షల వ్యయంతో నాలుగు పారిశుద్ధ్య వాహనాలు ప్రారంభం, వాహనాలను ప్రారంభించిన కలెక్టర్ ప్రావీణ్య,TGIIC చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి,400 పైచిలుకు మునిసిపల్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం.

తేది:29-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం సంగారెడ్డి మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణకు గాను రూ.40 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన నాలుగు పారిశుద్ధ్య వాహనాలను (ట్రాక్టర్లు) మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో TGIIC చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి,జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
సంగారెడ్డి పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో పారిశుధ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. వారి పని మరింత సులభంగా, వేగంగా సాగేందుకు ఆధునిక వాహనాలనుఅందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ వాహనాల ద్వారా చెత్త సేకరణ, తరలింపు పనులు మరింత సమర్థవంతంగా జరుగుతాయన్నారు.
అదేవిధంగా, సంగారెడ్డి మున్సిపాలిటీలో పనిచేస్తున్న 400 పైచిలుకు మునిసిపల్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ, ఆ బీమా పాలసీలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీలను TGIIC చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి సంబంధిత సిబ్బందికి పంపిణీ చేశారు.పారిశుధ్య సిబ్బంది తమ విధులను నిర్వర్తించే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదవశాత్తు తాత్కాలిక వైకల్యం, శాశ్వత వైకల్యం కలిగిన లేదా మరణించిన సందర్భాల్లో ఈ ప్రమాద బీమా పాలసీ ద్వారా బాధితుడు లేదా వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించ బడుతుందని తెలిపారు.
ఈ ప్రమాద బీమా సౌకర్యం ద్వారా సిబ్బందికి భద్రతా
భావం పెరుగుతుందని, వారి కుటుంబాలకు కూడా భరోసా కలుగుతుందని నిర్మలా జయప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. పారిశుధ్య సిబ్బంది ఆరోగ్యం, భద్రత పట్ల ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *