
తేదీ:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.
సంగారెడ్డి జిల్లా: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారిస్తూ గ్రామీణ పేదల ఉపాధికి కేంద్ర సర్కార్ ఉరి వేసే ప్రయత్నం చేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ ఆరోపించారు.ఆదివారం కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలకు నిరసనగా టీపీసీసీ పిలుపు మేరకు ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గాంధీ విగ్రహం వద్ద ఆ మహాత్ముని జెండా ఎగురవేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,దేశంలో పేద ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని మహాత్మా గాంధీ పేరుతో ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం,రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు సమకూర్చడం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు ఉపాధి లభించిందని, ఎంతోమంది ఆకలి చావుల నుంచి రక్షించబడడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు సైతం అభివృద్ధి చెందాయన్నారు. అయితే పేద ప్రజల ఉపాధిని ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని బలహీనపరిచి, కొత్త పేరుతో ప్రవేశపెట్టడం ద్వారా పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 90 శాతం నిధులు ఇస్తుండగా,కొత్త చట్టంతో 60 శాతం నిధులు మాత్రమే కేంద్రం ఇస్తుందని 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని అనడం ఉపాధి హామీ పథకానికి సమాధి కట్టడమేనన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఇప్పుడు ఈ భారం కూడా తోడవడంతో చాలా రాష్ట్రాలు ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్ముడు పేరుతో కాంగ్రెస్ పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రయత్నం చేస్తే ఓర్వలేని బీజేపీ పేద ప్రజలను మళ్లీ ఆకలి చావులకు బలిచేసే విధంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు.అదే విధంగా మహాత్ముడి పేరుతో సాగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వ అన్యాయాన్ని ప్రజ క్షేత్రంలో ఎండగడతామన్నారు.నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించినట్టు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించని పక్షంలో జనవరి 5వ తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్,మాజీ పిఎసిఎస్ చైర్మన్ నారాయణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్,అజ్జు,ముత్తంగి అశోక్,గోపాల్,గౌరీ శంకర్, అనిల్ కుమార్,కరణ్,సుంకరి యాదయ్య,ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.