జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న జీవో–252ను తక్షణమే సవరించాలి-బొమ్మ అమరేందర్, హక్కుల సాధన కోసం కదం తొక్కిన మేడ్చల్ జిల్లా జర్నలిస్టులు.

తేది:27-12-2025 మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా TSLAWNEWS కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఇన్చార్జ్ మల్లికార్జున్ బెస్త .

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే జీఓ నెం.252ను తక్షణమే సవరించాలని టీయూడబ్ల్యూజే (TUWJ–H–143) మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు బొమ్మ అమరేందర్, ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
తెలంగాణ జర్నలిస్టు ఫోరం, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ముందు మేడ్చల్ జిల్లా జర్నలిస్టులు భారీ సంఖ్యలో పాల్గొని ఆందోళన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన జర్నలిస్టు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లోపభూయిష్టమైన జీఓ–252 వల్ల పట్టణ ప్రాంతాల్లో, లక్ష జనాభా దాటిన మున్సిపాలిటీల్లో అక్రిడిటేషన్ కార్డులకు భారీగా కోత పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా జర్నలిస్టుల సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం శోచనీయమని విమర్శించారు. జీవో–252 జర్నలిస్టుల జీవితాలకు గొడ్డలి పెట్టులాంటిదని, గతంలో అమలులో ఉన్న జీఓ–239ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే రెండు కార్డుల విధానానికి తక్షణమే స్వస్తి పలకాలని కోరారు.
జర్నలిస్టులకు అందించాల్సిన ఆర్టీసీ బస్ పాస్‌లకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.
ధర్నా అనంతరం జర్నలిస్టుల సమస్యలపై మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై కోత విధించవద్దని కోరగా, అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల నివాస స్థలాల అంశంపై జిల్లా కలెక్టర్‌తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు శివాజీ, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు సుగ్రీవుడు, జిల్లా స్టాపర్స్, మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్ష–కార్యదర్శులు, వివిధ నియోజకవర్గాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నేతలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *