బంగ్లాదేశ్‌లో తీవ్రవాద శక్తులు మరోసారి రెచ్చిపోయాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ రాక్ గాయకుడు జేమ్స్ (నగర్ బౌల్) కచేరీపై ఛాందసవాద మూకలు రాళ్లతో దాడికి పాల్పడ్డాయి. ఫరీద్‌పూర్‌లోని ఒక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమంపై ఒక్కసారిగా ఇటుకలు, రాళ్లు విసరడంతో ప్రేక్షకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ హింసాత్మక ఘటనలో సుమారు 25 మందికి పైగా గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా స్థానిక అధికారులు కచేరీని రద్దు చేయడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఈ భయానక పరిస్థితులపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో లౌకికవాదం, ప్రగతిశీల చైతన్యాన్ని చాటే ‘ఛాయానాట్’ వంటి ప్రతిష్టాత్మక సాంస్కృతిక సంస్థలను జిహాదీలు తగులబెడుతున్నారని ఆమె మండిపడ్డారు. సంగీతాన్ని, కళలను ద్వేషించే శక్తులు పేట్రేగిపోతుండటంతో.. సిరాజ్ అలీ ఖాన్, అర్మాన్ ఖాన్ వంటి అంతర్జాతీయ స్థాయి కళాకారులు బంగ్లాదేశ్‌లో ప్రదర్శనలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ భారత్‌కు తిరిగి వెళ్లడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
జేమ్స్ కేవలం బంగ్లాదేశ్‌లోనే కాకుండా, భారత్‌లోనూ ‘భీగీ భీగీ’, ‘ఆల్విదా’ వంటి సూపర్ హిట్ హిందీ పాటలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అటువంటి ప్రజాదరణ కలిగిన కళాకారుడిపైనే దాడి జరగడం బంగ్లాదేశ్‌లో మారుతున్న విపరీత ధోరణులను సూచిస్తోంది. కళాకారులు, సాంస్కృతిక సంస్థలకే రక్షణ లేని చోట సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడమే కాకుండా, బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడ్డాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.