వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన “రప్పా రప్పా” ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా పెను వివాదానికి దారితీశాయి. హింసను ప్రేరేపించేలా, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ పోస్టర్లపై విమర్శలు వస్తున్నప్పటికీ, కార్యకర్తలు ఏమాత్రం తగ్గడం లేదు. పలుచోట్ల జంతుబలులు ఇచ్చి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం వంటి ఘటనలు కలకలం రేపాయి. ముఖ్యంగా గోపాలపురం నియోజకవర్గంలో 2029లో అధికారంలోకి వచ్చిన వెంటనే “రప్పా రప్పా నరుకుతాం” అని రాసి ఉన్న పోస్టర్లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఈ ఘటనలపై పోలీసులు కఠినంగా స్పందిస్తున్నారు. గోపాలపురం, నల్లజెర్ల మండలాల్లో జంతుబలులకు పాల్పడి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఏడుగురు నిందతులకు పోలీసులు “షాక్ ట్రీట్‌మెంట్” ఇచ్చారు. నిందితులను స్టేషన్ నుంచి కోర్టు వరకు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. రాజకీయ ఉత్సాహంతో ఇలాంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడి భవిష్యత్తును పాడుకోవద్దని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన యజమానులపై కూడా కేసులు నమోదు చేసి, షాపులను సీజ్ చేశారు.
వైసీపీ శ్రేణుల తీరుపై రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్రంగా మండిపడ్డారు. జంతుబలులు చేస్తూ ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి సైకోలను పార్టీ అధినేత జగన్ ఎందుకు ఖండించడం లేదని ఆమె ప్రశ్నించారు. బాణసంచా కాల్చవద్దని కోరిన ఓ గర్భిణిపై దాడి చేయడం, వేట కొడవళ్లతో వీధుల్లో ప్రదర్శనలు చేయడం వంటి చర్యలు రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా, అరెస్టులు చేస్తున్నా వైకాపా శ్రేణులు పలు ప్రాంతాల్లో తిరిగి అదే తరహా అరాచకాలకు పాల్పడుతుండటం ఉద్రిక్తతలకు దారితీస్తోంది.