చైనా ఇంజనీరింగ్ అద్భుతం: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ ప్రారంభం

చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం ఆవిష్కృతమైంది. తియాన్షాన్ పర్వత శ్రేణులను తొలిచి నిర్మించిన ‘తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్’ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. 22.13 కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్, ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌గా రికార్డు సృష్టించింది. ఈ మెగా ప్రాజెక్టు వల్ల ఉత్తర మరియు దక్షిణ షిన్జియాంగ్ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గంటల నుంచి నిమిషాలకు తగ్గిపోనుంది.

ఈ టన్నెల్ నిర్మాణం సామాన్యమైన విషయం కాదు. సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో, మైనస్ 42 డిగ్రీల గడ్డకట్టే చలిలో చైనా ఇంజనీర్లు 5 ఏళ్ల పాటు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. సాధారణ పద్ధతుల్లో ఈ నిర్మాణం చేపట్టడానికి 10 ఏళ్లు పట్టేది, కానీ చైనా సొంతంగా తయారు చేసిన భారీ టన్నెల్ బోరింగ్ మెషీన్ల (TBM) సాయంతో సగం కాలంలోనే దీన్ని పూర్తి చేశారు. ఈ టన్నెల్ కోసం 706 మీటర్ల లోతైన నిలువు షాఫ్ట్ (Vertical Shaft)ను కూడా నిర్మించారు, ఇది ప్రసిద్ధ షాంఘై టవర్ కంటే ఎత్తైనది కావడం విశేషం.

ఈ టన్నెల్ అందుబాటులోకి రావడం వల్ల ఉరుమ్కి మరియు కోర్లా నగరాల మధ్య ప్రయాణ సమయం 7 గంటల నుంచి కేవలం మూడున్నర గంటలకు తగ్గింది. దీనివల్ల ఇంధన ఆదా అవ్వడమే కాకుండా, ఉత్తర షిన్జియాంగ్‌లోని పారిశ్రామిక వనరులు, దక్షిణ షిన్జియాంగ్‌లోని వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత వేగవంతం కానుంది. సుమారు 60 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు, మధ్య ఆసియా దేశాలతో చైనాకు ఉన్న రవాణా సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *