హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించి నేరాల గణాంకాలను సీపీ సజ్జనార్ విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే నగరంలో ఓవరాల్గా నేరాల శాతం 15 శాతం మేర తగ్గడం విశేషం. మొత్తం మీద ఈ ఏడాది 19,831 కేసులు నమోదు కాగా, శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని సీపీ స్పష్టం చేశారు. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపింగ్ వంటి తీవ్రమైన నేరాలు తగ్గుముఖం పట్టాయని, కేవలం కొన్ని సెన్సేషనల్ కేసులను బట్టి నేరాలు పెరిగాయని భావించడం సరికాదని ఆయన సూచించారు.
నగరంలో మొత్తం నేరాలు తగ్గినప్పటికీ, మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 6 శాతం, చిన్నారులపై నేరాలు (పోక్సో కేసులు) ఏకంగా 27 శాతం పెరిగాయి. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయని, ఈ ఏడాది 1,114 కేసులు నమోదు చేసి 3,817 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని సీపీ వివరించారు. అలాగే భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.
సాంకేతిక నేరాల విషయానికి వస్తే, సైబర్ క్రైమ్ కేసులు గత ఏడాదితో పోలిస్తే 8 శాతం తగ్గాయి. మొత్తం 2,286 సైబర్ నేరాలు నమోదు కాగా, సుమారు 319 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో 54 కోట్ల రూపాయలను పోలీసులు హోల్డ్ చేయగలిగారు. మరోవైపు, డ్రగ్స్ నియంత్రణలో భాగంగా 368 కేసులు నమోదు చేసి 2,690 మందిని అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ విభాగంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గినప్పటికీ, మైనర్ డ్రైవింగ్ కేసులు పెరగడం పట్ల పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.