దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దియా బినూ రికార్డు!

కేరళలోని కొట్టాయం జిల్లా పాలాయ్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా 21 ఏళ్ల దియా బినూ పులిక్కకండం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భారత స్థానిక పాలనా చరిత్రలో ఇంత తక్కువ వయసులో ఈ పదవిని చేపట్టడం ఒక అరుదైన ఘట్టం. చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ పూర్తి చేసిన దియా, తన తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడమే కాకుండా ఏకంగా మున్సిపాలిటీకి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.

ఈ ఎన్నికల వెనుక ఒక ఆసక్తికరమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దియా, ఆమె తండ్రి (మాజీ చైర్మన్ బిను పులిక్కకండం), మరియు ఆమె బాబాయ్ (బిజు పులిక్కకండం) ముగ్గురూ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలుపొందారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితుల్లో, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కు మద్దతు ఇచ్చేందుకు దియా కుటుంబం ఒక షరతు పెట్టింది. అదేమిటంటే.. దియాను చైర్‌పర్సన్‌గా చేయాలని. ఇందుకు యూడీఎఫ్ అంగీకరించడంతో ఆమె ఎన్నిక సాధ్యమైంది.

విశేషం ఏమిటంటే, దియా అధ్యక్షత వహించే కౌన్సిల్ సమావేశాల్లో ఆమె తండ్రి మరియు బాబాయ్ కౌన్సిలర్లుగా కూర్చోనున్నారు. రెండేళ్ల క్రితం తన తండ్రిని చైర్మన్ పదవి నుండి తొలగించిన ప్రత్యర్థులకు, ఇప్పుడు ఆయన కుమార్తె అదే పదవిని చేజిక్కించుకోవడం ద్వారా తగిన సమాధానం ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే పీజీ (ఉన్నత చదువులు) కొనసాగిస్తానని, పాలాయ్ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని దియా ఈ సందర్భంగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *