తేది:26-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం .
మెదక్ జిల్లా : పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని, ఆయన ఆశయాల సాధన కోసం నిరంతరం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి బండ నరేందర్ పిలుపునిచ్చారు.
శుక్రవారం రోజున కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి సందర్భంగా మెదక్ పట్టణంలోని రామాలయం వద్ద ఉన్న కేవల్ కిషన్ విగ్రహానికి ముదిరాజ్ మహాసభ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బండ నరేందర్ మాట్లాడుతూ, ఉన్నత చదువులు అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి పేద ప్రజల హక్కుల కోసం పోరాట మార్గాన్ని ఎంచుకున్న మహానుభావుడు కేవల్ కిషన్ అని కొనియాడారు. శ్రామికులు, కార్మికులను ఐక్యం చేసి వారి హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడుతూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు.
ప్రజల్లో రోజు రోజుకూ పెరుగుతున్న చైతన్యం, తిరుగుబాటు భావనను చూసి పెత్తందారులు, భూస్వాములు భయపడిపోయారని, అందుకే కామ్రేడ్ కేవల్ కిషన్‌ను ఎలాగైనా హతమార్చాలని కుట్ర పన్నారని ఆరోపించారు. 1960 డిసెంబర్ 26న పొలంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఆయనను హత్య చేశారని గుర్తు చేశారు.
అయితే, ఆయనను భౌతికంగా మాత్రమే చంపగలిగారని, కానీ ఆయన ఆశయాలను ప్రజల నుంచి వేరు చేయలేకపోయారని అన్నారు. కేవల్ కిషన్ హత్య జరిగిన ప్రదేశంలోనే సమాధిని నిర్మించి, ప్రతి సంవత్సరం ఎడ్లబండ్ల జాతరను ఘనంగా నిర్వహించడం ఆయనపై ప్రజల అపార అభిమానానికి నిదర్శనమని చెప్పారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్టిచాకిరి, కుల వివక్ష, అంటరానితనం, మహిళలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూస్వాములు, జమీందారుల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు.
కేవల్ కిషన్ చేసిన పోరాటాలకు గుర్తుగా మెదక్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తమ పిల్లలకు కేవల్ కిషన్, కేవల్ కిషణమ్మ వంటి పేర్లు పెట్టుకోవడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న అనేక ప్రజా ఉద్యమాలకు కేవల్ కిషన్ భవన్ వేదికగా నిలవడం ఆయన పోరాట స్మృతులను నిరంతరం గుర్తు చేస్తోందని చెప్పారు.
పొలంపల్లి వద్ద ఉన్న కేవల్ కిషన్ సమాధి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, అక్కడ స్మృతి వనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అది సూరి, బండి గోపాల కృష్ణ, గోవింద్ రాజ్, బీమరి కిశోర్, శేఖర్, సందీప్, ప్రభుకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.