చిన్నారులు ఇంటర్నెట్‌లో అడల్ట్ కంటెంట్‌కు బానిసలవుతున్నారనే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై మద్రాస్ హైకోర్టు శుక్రవారం కీలక విచారణ జరిపింది. జస్టిస్ జీ జయచంద్రన్, జస్టిస్ కేకే రామక్రిష్ణన్‌లతో కూడిన ధర్మాసనం.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించేలా చట్టం చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన ‘కనీస వయస్సు విధానాన్ని’ (Social Media Minimum Age Law) భారత్‌లో కూడా పరిశీలించాలని కోర్టు సూచించింది.
సోషల్ మీడియాలో అసభ్యకరమైన మరియు చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ చాలా తేలికగా అందుబాటులో ఉండటంపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియంత్రణ చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని, టెక్ కంపెనీలు కూడా ఈ విషయంలో విఫలమవుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. చిన్నారుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే కఠినమైన చట్టం అవసరమని పేర్కొంది.
సామాజిక మాధ్యమాలు చిన్నారుల మెదడుపై మరియు ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా అనుసరిస్తున్న నిబంధనలను ఒక నమూనాగా తీసుకుని, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రూల్స్‌లో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది.