
తేది:26-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్, Maroju Bhaasker.
జనగామ జిల్లా: కేంద్ర ప్రభుత్వం అమలుచేయ తలపెట్టిన విబిజి రాంజీ బిల్లు రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కాకర్ల పద్మ, మండల అధ్యక్షులు కాకర్ల బాబు డిమాండ్ చేశారు. మండలంలోని మంచిప్పుల గ్రామంలో శుక్రవారం వి బి_ జి రాంజీ బిల్లును రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ , బిల్లు ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా పద్మ బాబు, మాట్లాడుతూ
2005లో యూపీఏ గవర్నమెంట్ హయాములో కమ్యూనిస్టు పార్టీ ఐక్య పోరాటాల ద్వారా చట్టంగా సాధించుకున్న ఉపాధి హామీ పథకం చట్టం 2005ను రద్దు చేస్తూ గ్రామాల్లో పేదల పొట్ట కొట్టే కుట్ర పన్నుతున్న బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాలకు ఉపాధి కొరకు వలస వెళ్లే కార్మికుల సంఖ్య తగ్గిందని వారు వివరించారు. జాతీయ నాయకునిగా పిలవబడే మహాత్మా గాంధీ ని చంపిన గాడ్సే వారసులే నేడు గాంధీ పేరు లేకుండా ఉపాధి హామీ చట్టం కాదు, పథకమని రూపకల్పన చేయడం సిగ్గుచేటని అన్నారు. సంవత్సరానికి 200 దినాలు కల్పించాలని ,రోజువారీ కూలీ 600 రూపాయల వేతనము ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు, పోరాటాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్య పరచడం సరైన నిర్ణయం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తూ, చివరికి రద్దు చేయుటకు నిర్ణయించడం కార్మికుల పాలిట శాపంగా బిజెపి ప్రభుత్వం మారిందని దుయ్యబట్టరు . 2005లో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధాతధంగా కొనసాగించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాణాల సోమయ్య, బాణాల మల్లయ్య, కాకర్ల సోమనర్సయ్య, సోమక్క, పాలడుగు యాదమ్మ, ఉదయ్, కాకర్ల వెన్నెల, రేణుక, ఇటిక లచ్చమ్మ, ,ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.