మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో సభ్యసమాజం తలదించుకునే ఘోరం వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో పాటు, భర్త చనిపోతే గృహ రుణం (House Loan) మాఫీ అవుతుందనే దురాశతో ఓ భార్య తన భర్తనే కిరాతకంగా చంపించింది. బోడమంచతండా శివారులో భూక్య ఈరన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో ఇది రోడ్డు ప్రమాదం కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేలింది. ఈ కేసులో మృతుడి భార్య విజయతో పాటు ఆమె ప్రియుడు బోడబాలోజీ, మరో నిందితుడు ధర్మారపు భరత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. విజయకు అదే తండాకు చెందిన బోడబాలోజీతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈరన్న పేరుతో వీరు ముత్తూట్ సంస్థలో హౌస్ లోన్ ఇప్పించారు. అయితే, లోన్ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ అప్పు మాఫీ అవుతుందని తెలుసుకున్న నిందితులు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఈరన్నను వదిలించుకోవాలని కుట్ర పన్నారు. ఆర్ఎంపీ వైద్యుడైన భరత్ సహాయంతో ఈ దారుణానికి ప్రణాళిక రచించి, హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
ముందుగా అనుకున్న పథకం ప్రకారం, ఈ నెల 22న రాత్రి మద్యం తాగుదామని ఈరన్నను బయటకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత, బోడబాలోజీ ఇనుప రాడ్డుతో ఈరన్న తల వెనుక బలంగా కొట్టాడు. అతను కిందపడిపోగానే ఆర్ఎంపీ డాక్టర్ భరత్ టవల్‌తో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని అతని బైక్‌తో సహా రోడ్డు పక్కన ఉన్న పొలంలో పడేశారు. కేసు నమోదు చేసిన కేసముద్రం పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.