కాగజ్‌నగర్‌లో తీరని విషాదం: వంతెన పైనుంచి పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వైద్యం కోసం వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ జాకీర్ కుటుంబం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో స్వగ్రామానికి వస్తుండగా, దేవాడ-సోండో సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి వంతెన పైనుంచి కిందకు పడిపోవడంతో ఈ ఘోరం జరిగింది.

ఈ ప్రమాదంలో జాకీర్ భార్య సల్మా బేగం (45), కుమార్తె శబ్రీమ్ (20)తో పాటు వారి బంధువులు ఆఫ్జా బేగం (45), సహారా (18) అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లి, క్షేమంగా ఇంటికి చేరుకుంటారనుకున్న తరుణంలో నలుగురు మహిళలు మృత్యువాత పడటంతో నిజాముద్దీన్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే కారు నియంత్రణ కోల్పోయి వంతెన రక్షణ గోడను ఢీకొట్టి కింద పడిపోయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఆందోళనకరంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే చంద్రపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *