తెలుగు రాష్ట్రాలపై ‘చలిపులి’ పంజా: పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు!

భారతదేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతంలో చలితీవ్రత ఈసారి రికార్డు స్థాయికి చేరుకుంది. భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించినట్లుగానే, చలిగాలుల ప్రభావంతో జనం గజగజ వణుకుతున్నారు. కనీసం తమ రోజువారీ పనులు కూడా చేసుకోలేనంతగా వాతావరణం గడ్డకట్టేలా ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో గత పదిహేను రోజుల నుంచి పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలితీవ్రతకు నీళ్లు కూడా గడ్డకట్టే పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ ఇలాంటి వింత పరిస్థితులు చూడలేదని ఏజెన్సీ ప్రాంత వృద్ధులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు మొదలవుతుండటంతో గిరిజన ప్రాంత ప్రజలు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతుండటంతో పొగమంచు కారణంగా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో చలి మరింత ఉధృతంగా ఉంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 7.8, హైదరాబాద్‌లో 10-12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వాతావరణ కేంద్రం మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు చలిగాలుల వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి సమయాల్లో బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *