కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ఒక ‘శని’ అని, ఆయనే రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ ఇప్పుడు కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. గతంలో కేసీఆర్, జగన్ మధ్య జరిగిన ఒప్పందాలను వెంటనే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ సమంజసమేనని బండి సంజయ్ సమర్థించారు. కేసీఆర్ తన పాలనలో అనేకమంది ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కూడా ఆయన తప్పుబట్టారు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సరికావని, అవి స్వయంగా రేవంత్‌కే నష్టం కలిగిస్తాయని హితవు పలికారు. కేటీఆర్‌కు అహంకారం ఎక్కువని, గతంలో వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము ఎప్పుడూ ఖండిస్తూనే ఉన్నామని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ, ఇద్దరు ముగ్గురు మంత్రులు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. పార్టీ మార్పుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ సుమోటాగా తీసుకుని తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో గతంలో తాను ఆధారాలతో సహా అన్ని విషయాలను బయటపెట్టానని, ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన స్పష్టం చేశారు.