తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించిన ఆయన, ఈ పథకం అమలుపై కీలక స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ నిధులు అందుతాయని, సాగు చేయని ఖాళీ భూములకు నిధులు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం ఈసారి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి సాగవుతుందో తెలుసుకోవడానికి శాటిలైట్ చిత్రాల ద్వారా వివరాలు సేకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ శాటిలైట్ నివేదిక అందిన వెంటనే, సాగు లెక్కల ఆధారంగా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
రైతు భరోసా నిధులతో పాటు వ్యవసాయ యాంత్రీకారణపై కూడా మంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వ్యవసాయ యాంత్రీకారణ పథకాన్ని పునఃప్రారంభిస్తామని వెల్లడించారు. సాగవుతున్న ప్రతి ఎకరాకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతు సంక్షేమమే తమ ప్రాధాన్యతని తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.