సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సమాజంలోని అన్యాయాలపై తన గళాన్ని మరోసారి బలంగా వినిపించారు. కేవలం మహిళల సమస్యలకే పరిమితం కాకుండా, సమాజంలో ఎక్కడ తప్పు జరిగినా నిర్భయంగా స్పందిస్తానని ఆమె స్పష్టం చేశారు. విమర్శలకు కుంగిపోకుండా, తన పంథాలో తాను ధైర్యంగా ముందుకు సాగుతానని, తన వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరని ఆమె నొక్కి చెప్పారు.
ఇటీవల హీరోయిన్ల వస్త్రాధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి వివరణ ఇచ్చే క్రమంలో ఆయన అనసూయ పేరును ప్రస్తావించడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా వరుస పోస్ట్‌లతో ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలను ఏమాత్రం లెక్కచేయకుండా, తన ఉద్దేశం సమాజంలో నిర్లక్ష్యం చేయబడిన అంశాలపై అవగాహన కల్పించడమేనని ఆమె పేర్కొన్నారు.
తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను చెప్పింది చేయడానికి కట్టుబడి ఉంటాను” అని అనసూయ తెలిపారు. తన ఎదుగుదల చూసి అసూయపడేవారు అలాగే ఉంటారని, కానీ తాము మాత్రం మరింత శక్తిమంతంగా, ఆకర్షణీయంగా ముందుకు సాగుతామని ఆమె గట్టిగా బదులిచ్చారు. ఈ పోస్ట్‌తో తనను టార్గెట్ చేసే వారికి ఆమె పరోక్షంగా గట్టి హెచ్చరిక జారీ చేశారు.