ప్రముఖ ఫోటోగ్రాఫర్ రాకేష్ పులప వనజంగి అందాలను తన కెమెరాలో బంధించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. “వనజంగి ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ విఫలం కాదు. మంత్రముగ్ధులను చేసే మేఘాల పొరలు, బంగారు సూర్యకాంతి ప్రకృతి ప్రసాదించిన అద్భుతం” అంటూ ప్రశంసలు కురిపించారు. సముద్ర మట్టానికి సుమారు 3400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందుతున్న పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.
వనజంగి ప్రధాన ఆకర్షణ ఇక్కడి సూర్యోదయం. తెల్లవారుజామున మంచు తెరల మధ్య నుంచి సూర్యకిరణాలు ప్రసరిస్తుంటే, కొండల మధ్య అలుముకున్న మేఘాలు అలల సముద్రంలా కనిపిస్తాయి. అందుకే పర్యాటకులు దీనిని ‘మేఘాల సముద్రం’ (Sea of Clouds) అని పిలుస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి, పర్యాటకులకు కాశ్మీర్‌ను తలపించే అనుభూతిని ఇస్తుంది. అరకు, లంబసింగి వంటి ప్రాంతాలకు సమీపంలో ఉండటం వనజంగికి అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.
పర్యాటక రంగం ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం వనజంగిలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. సుమారు 5 కిలోమీటర్ల మేర కొండ మార్గంలో సాగే ట్రెక్కింగ్ సాహస ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నారా లోకేష్ చేసిన ట్వీట్ వల్ల ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్తులో వనజంగిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎకో-టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని పర్యాటక శాఖ వర్గాలు భావిస్తున్నాయి.