అనంతపురంలో కన్నతండ్రి కిరాతకం: ఇద్దరు కుమార్తెలను కాలువలోకి తోసి హత్య

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో మానవత్వం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. కన్నకూతుళ్లపై ప్రేమాభిమానాలు చూపాల్సిన తండ్రే కాలయముడిగా మారాడు. గ్రామానికి చెందిన కల్లప్ప అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలు సింధు, అనసూయలను హెచ్‌ఎల్‌సీ (HLC) కాలువ వద్దకు తీసుకెళ్లి నీళ్లలోకి తోసేశాడు. ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఆ పసిపిల్లలు తండ్రి చేతిలోనే బలవ్వడం గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. కల్లప్ప తొలుత పెద్ద కుమార్తెను కాలువలోకి తోసేశాడు. అది చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించిన చిన్న కుమార్తెను వెంబడించి పట్టుకుని మరీ నీళ్లలోకి నెట్టినట్టు తెలుస్తోంది. పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు నిలదీయగా, కల్లప్ప తానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంగీకరించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అనసూయ మృతదేహం లభ్యమవగా, మరో బాలిక సింధు కోసం గాలింపు కొనసాగుతోంది.

ప్రస్తుతం నిందితుడు కల్లప్ప అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక తండ్రి తన కన్నబిడ్డలను ఇంత దారుణంగా చంపడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కుటుంబ కలహాలా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడు ఆసుపత్రి నుండి కోలుకున్న తర్వాత పూర్తిస్థాయి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో నేమకల్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *