నటుడు శివాజీ తన ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ వేదికగా హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలంటూ ఆయన చేసిన ప్రసంగంలో వాడిన అభ్యంతరకర పదజాలంపై సినీ రంగం నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గాయని చిన్మయి, నటి అనసూయ వంటి వారు కౌంటర్లు ఇవ్వగా, తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV) ఈ వివాదంలోకి ప్రవేశించి తనదైన శైలిలో శివాజీపై విరుచుకుపడ్డారు.
శివాజీని ఉద్దేశించి వర్మ సోషల్ మీడియా వేదికగా అత్యంత కఠినమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. “శివాజీ.. నువ్వెవడివైనా సరే, నీలాంటి సంస్కారహీనుడిని, మురికివాడిని నీ ఇంట్లోని మహిళలు భరిస్తుంటే వారికి నీతులు చెప్పుకో. అంతే కానీ, సమాజంలోని ఇతర మహిళలు లేదా సినీ పరిశ్రమలోని వారి వ్యక్తిగత స్వేచ్ఛపై నీ మురికి అభిప్రాయాలను రుద్దకు” అంటూ వర్మ ధ్వజమెత్తారు. మహిళల దుస్తుల ఎంపికపై నైతికతను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
మంచు లక్ష్మి తన సోదరుడు మనోజ్‌ను అభినందిస్తూ చేసిన ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. శివాజీ వాడిన ‘దరిద్రపు ముం…’ వంటి పదాలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం కారణంగా డిసెంబర్ 25న విడుదల కానున్న ‘దండోరా’ సినిమాపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.