భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO) వైమానిక దళం కోసం ఒక విప్లవాత్మక నెక్స్ట్ జనరేషన్ క్రూయిజ్ క్షిపణిని సిద్ధం చేస్తోంది. ఈ క్షిపణి కేవలం వేగంగా వెళ్లి లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా, దాడికి ముందు ఆ లక్ష్యాన్ని స్వయంగా ధృవీకరించుకునే ‘స్మార్ట్’ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సుమారు 250 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ మిసైల్, శత్రువుల కళ్లుగప్పి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. నిర్ణయాధికారం మరియు సాంకేతికతలో ఇది బ్రహ్మోస్, అగ్ని-5 వంటి శక్తివంతమైన క్షిపణుల కంటే మెరుగైనదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ క్షిపణిలో అత్యంత కీలకమైన ‘మ్యాన్-ఇన్-ది-లూప్’ (Man-in-the-loop) టెక్నాలజీని వాడుతున్నారు. సాధారణ క్షిపణులు ప్రయోగించాక నేరుగా లక్ష్యాన్ని ఢీకొంటాయి, కానీ ఈ స్మార్ట్ క్షిపణి లక్ష్యం ఉన్న ప్రాంతంలో కొంతసేపు గాలిలోనే ఉండి (Loitering capability), అక్కడి లైవ్ డేటాను కంట్రోల్ రూమ్‌కు పంపిస్తుంది. అధికారులు ఆ దృశ్యాలను చూసి లక్ష్యాన్ని నిర్ధారించిన తర్వాతే దాడికి ఆదేశిస్తారు. దీనివల్ల పౌరులకు లేదా అనవసర ఆస్తులకు జరిగే నష్టాన్ని (Collateral damage) పూర్తిగా అరికట్టవచ్చు. ఒకవేళ లక్ష్యం సరైనది కాదనిపిస్తే దాడిని రద్దు చేసే వెసులుబాటు కూడా ఇందులో ఉంది.
సుమారు 50 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల ఈ క్షిపణిని మోడ్యులర్ డిజైన్‌తో తయారు చేస్తున్నారు. అంటే మిషన్ అవసరాన్ని బట్టి వివిధ రకాల సెన్సార్లను ఇందులో అమర్చుకోవచ్చు. నావిగేషన్ కోసం జీపీఎస్ మరియు ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ కలయికను వాడటం వల్ల సముద్రంలోని యుద్ధనౌకలను, భూమిపై ఉన్న మొబైల్ ఆస్తులను ఇది సులువుగా వేటాడగలదు. భవిష్యత్తులో రాబోయే ఏఎంసీఏ (AMCA) వంటి ఐదవ తరం యుద్ధ విమానాల్లో ఈ క్షిపణులను అమర్చనున్నారు. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా రక్షణ రంగంలో మరో మైలురాయిగా నిలవనుంది.