


తేదీ: 21-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు
అమీన్పూర్: ఉదయం వేళ ప్రశాంతంగా ఉండే అమీన్పూర్ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పీఎన్‌ఆర్ కాలనీ అమీన్పూర్ ఎదురుగా, సూర్య గ్లోబల్ స్కూల్‌కు వెళ్లే రోడ్డుపక్కన (ABODE MJL హైట్స్ ముందు) చెట్ల పొదల్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
శనివారం (20-12-2025) ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో అక్కడి ప్రజలు చెట్ల మధ్య యువకుడు కదలకుండా పడివున్నట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా మృతుడి వయస్సు సుమారు 20 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. అతడి ఎడమ చేతిపై “Priyanka” అనే టాటూ, D❣️P గుర్తుతో పచ్చ బొట్టు స్పష్టంగా కనిపించడంతో పాటు, మెడలో నలుపు దారానికి మూడు తాళాలు ఉన్న కీచైన్ ధరించి ఉన్నట్లు గుర్తించారు.
మృతుడు ఎరుపు–నలుపు రంగులతో డబుల్ తెలుపు గీతలు ఉన్న ఫుల్ షర్ట్, డార్క్ ఆష్ రంగు ప్యాంటు, బ్రౌన్ రంగు EXODA కంపెనీకి చెందిన ఫుల్ డ్రాయర్, చేతులకు నీలం రంగు గ్లౌజులు ధరించి ఉన్నాడు. శరీరంపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు లేకపోవడంతో పాటు, కూలీగా పనిచేసే వ్యక్తిలా కనిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా కలకృత్యాలకు వెళ్లి కింద పడటంతో మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు.