మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ‘వన్ టూ వన్’ (ముఖాముఖి) సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్-ఛార్జుల పెత్తనం అధికంగా ఉందని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని పలువురు ఎమ్మెల్యేలు పవన్ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ అధికారులు తమ మాట వినడం లేదని, కూటమిలో సర్దుకుపోతున్నా టీడీపీ నేతలు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని వారు వివరించారు.
దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ ఒక్కొక్కరితో సుమారు 30 నిమిషాల పాటు విడివిడిగా చర్చించారు. తొలుత అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌తో ప్రారంభమైన ఈ భేటీలు, ఆ తర్వాత పంతం నానాజీ, లోకం నాగమాధవి, పంచకర్ల రమేష్ బాబు వంటి నేతలతో కొనసాగాయి. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని వారికి గట్టిగా దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్యేల ఫిర్యాదులపై స్పందించిన పవన్.. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని భరోసా ఇచ్చారు. అయితే, కూటమి స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎవరూ ప్రవర్తించవద్దని, అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐక్యంగా ఉండాలని, అదే సమయంలో జనసేన కేడర్‌కు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి నేతల మధ్య సమన్వయం చాలా అవసరమని, ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాలని పవన్ స్పష్టం చేశారు.