


తేది:18-12-2025 TSLANEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారి కృష్ణ గౌడ్.
సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యతో పాటు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ.
సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు 35 విభాగాలకు చెందిన ప్రత్యేక కోచ్ లతో క్రీడల్లో శిక్షణ.
రాష్ట్రస్థాయి 11వ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం.
సంగారెడ్డి జిల్లా: క్రీడలు వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా, మానసిక-శారీరక ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం పటాన్చెరువు మండలం లోని ఇస్నాపూర్ తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ( టి జి ఎస్ ఆర్ ఇ ఐ ఎస్ ) లో నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై అట్టహాసంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గురుకుల పాఠశాలలో జాతీయ జెండాతో పాటు స్పోర్ట్స్ ఫ్లాగ్‌ను ఆవిష్కరించారు. క్రీడాకారులతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు .రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకొని, క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ … రాష్ట్రస్థాయి 11వ స్పోర్ట్స్ మీట్‌కు సంగారెడ్డి జిల్లా వేదిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. నిత్యజీవితంలో ముఖ్యంగా అమ్మాయిలకు క్రీడలు, ఫిట్నెస్ అత్యంత అవసరమని తెలిపారు.పాఠశాల, కళాశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రీడల్లో ప్రావీణ్యం సాధించిన క్రీడాకారులు విద్య, ఉద్యోగాలు మాత్రమే కాకుండా జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు జిల్లాలో జరగడం హర్షించదగ్గ విషయం అన్నారు. క్రీడా పోటీల నియమ నిబంధనల ప్రకారం విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. క్రీడల ద్వారా అమ్మాయిలు శారీరక-మానసిక దృఢత్వాన్ని పొందించుకోవచ్చన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, క్రీడాశాఖలు అన్ని క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు.క్రీడల్లో గెలుపుతో వచ్చే పతకాలు మాత్రమే గొప్పవి కాదని, క్రీడల్లో పాల్గొనడమే నిజమైన విజయమని విద్యార్థులకు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు మూడు రోజుల పాటు జరిగే స్పోర్ట్స్ మీట్‌లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వివిధ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలను కళాశాలల్లో చదివే విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు 35 విభాగాలకు చెందిన నిష్ణాతులైన కోచులతో విద్యార్థులకు వారికి ఆసక్తి ఉన్న క్రీడలలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు . వాటిలో అర్హత గల పీఈటీలు, పీడీలు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి .
ఈ కార్యక్రమంలో గురుకుల కోఆర్డినేటర్ కల్పన, పటాన్చెరువు తహసీల్దార్ రంగారావు , అధికారులు, ప్రిన్సిపాళ్లు, పీఈటీలు, పీడీలు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థినులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.