ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్‌లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, ఈ రంగంలో భారత్ ఒక సూపర్ పవర్‌గా ఎదిగేందుకు అడుగులు వేస్తోంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న అంతర్జాతీయ కంపెనీలకు భారత్‌ను ఒక గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 2021లో ప్రభుత్వం ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా గుజరాత్‌కు చెందిన కేన్స్ సెమికాన్ సంస్థ తన తొలి చిప్ మాడ్యూళ్లను అమెరికాలోని కాలిఫోర్నియాకు ఎగుమతి చేసి చరిత్ర సృష్టించింది.
గుజరాత్‌లోని ధోలేరాలో టాటా గ్రూప్, తైవాన్‌కు చెందిన PSMC సంస్థతో కలిసి సుమారు 11 బిలియన్ డాలర్ల (₹91,000 కోట్లు) వ్యయంతో దేశంలోనే తొలి వాణిజ్య సెమీకండక్టర్ ఫౌండ్రీని నిర్మిస్తోంది. ఈ ప్లాంట్‌లో 28nm నుండి 110nm వరకు ఉండే ‘మేచ్యూర్ చిప్స్’ తయారవుతాయి. ఇవి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ మరియు పవర్ డివైజ్‌లలో విస్తృతంగా వాడతారు. అమెరికా దిగ్గజం ఇంటెల్ (Intel) కూడా ఈ ప్లాంట్ నుండి చిప్‌లను కొనుగోలు చేసే అవకాశం ఉండటం విశేషం. ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతీయ తయారీ రంగానికి లభించిన పెద్ద గుర్తింపుగా భావించవచ్చు.
అయితే, భారత్ ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా, తైవాన్ మరియు అమెరికా ప్రస్తుతం తయారు చేస్తున్న అత్యాధునిక 3nm, 7nm చిప్‌ల తయారీలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. బలమైన రాజకీయ సంకల్పం, మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రైవేట్ రంగ పెట్టుబడులతో గడచిన రెండేళ్లలో గణనీయమైన పురోగతి కనిపించినప్పటికీ.. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకోవాలంటే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడమే కాకుండా, నైపుణ్యం కలిగిన మానవ వనరులను కూడా పెద్ద ఎత్తున తయారు చేసుకోవాల్సి ఉంటుంది.