తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. మొత్తం 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే, 84 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యం కనబరిచారని వెల్లడించారు. చివరకు మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కూడా మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని, కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని ప్రజలే తీర్పు ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి సమర్థించారు. స్పీకర్ అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకున్నారని, అది నచ్చకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని ప్రతిపక్షాలకు సూచించారు. “అధికారం పోయినా కొందరికి అహంకారం తగ్గలేదు.. మూసీ కాలుష్యం కంటే కొందరి మాటల్లో విషం ఎక్కువ” అంటూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను తమ వారు కాదని చెప్పుకోవాల్సిన దుస్థితి బీఆర్ఎస్కు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసీఆర్ సభకు వచ్చి తగిన సూచనలు ఇవ్వవచ్చని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అలాగే బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై స్పందిస్తూ.. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ వరుసగా ఓడిపోతుంటే, హరీశ్ రావు వెనుక నుండి నాయకత్వం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు వచ్చిన పంచాయతీ ఫలితాలే రిపీట్ అవుతాయని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.