ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనకు, పోలీసు అధికారులపై రాళ్లురువ్వి నలుగురు పోలీసు అధికారులకు గాయాలు చేసి రెండు పోలీసు వాహనాలు ధ్వంసం చేసిన వ్యక్తులపై, వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు-జగిత్యాల డీఎస్పీ డి.రఘు చందర్.

తేది:18-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాలజిల్లా: వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో తేదీ : 17-12-2025, బుధవారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు అనంతరం, ఎన్నికల్లో ఓడిపోయిన ఒక వ్యక్తి తన అనుచరులు మరియు కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తూ, బ్యాలెట్ బాక్సులను తరలించకుండా అడ్డుకొని, పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు పోలీసులు సుమారు రెండు గంటల పాటు నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, ఆందోళనకారులు వినకుండా ప్రతిఘటించారు.
ఆందోళనకారులు పోలింగ్ సిబ్బంది మరియు పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. అనంతరం ఆందోళనకారులు పోలీసు అధికారులపై మరియు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడంతో నలుగురు పోలీసు అధికారులకు గాయాలు కావడంతో పాటు రెండు పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో, ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం బ్యాలెట్ బాక్సులు మరియు పోలింగ్ సిబ్బందిని పటిష్ట బందోబస్తు మధ్య సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.
ఈ ఘటనపై రిటర్నింగ్ అధికారి మరియు పోలీసు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు సంబంధించి, వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత వ్యక్తులపై రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.ఇట్టి ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ డి. రఘు చందర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *