అవి దేశ ఆస్తి, మీ కుటుంబంవి కావు: నెహ్రూ లేఖలను వెనక్కివ్వాలని సోనియాకు కేంద్రం డిమాండ్!

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన వ్యక్తిగత లేఖలు, నోట్స్ మరియు కార్టూన్లు దేశ సంపద అని, అవి గాంధీ కుటుంబం వ్యక్తిగత ఆస్తులు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అంశంపై సోనియా గాంధీకి గట్టి సూచనలు చేశారు. పీఎం మ్యూజియం అండ్ లైబ్రరీ (PMML) నుంచి అదృశ్యమైనట్లుగా భావిస్తున్న ఆ చారిత్రక పత్రాలను తక్షణమే తిరిగి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, 2008 ఆగస్టులో సోనియా గాంధీ ప్రతినిధి ఎంవీ రాజన్ అభ్యర్థన మేరకు నెహ్రూకు సంబంధించిన వ్యక్తిగత ఉత్తరాలను, నోట్స్‌ను మరియు 51 కార్టూన్లను సోనియా గాంధీకి అప్పగించారు. ఈ చారిత్రక డాక్యుమెంట్లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు సోనియాకు లేఖలు రాసినట్లు మంత్రి తెలిపారు. ఆ లేఖలు అదృశ్యం కాలేదని, అవి ఎవరి వద్ద ఉన్నాయో తమకు తెలుసని ఆయన పార్లమెంట్‌లో పేర్కొన్నారు.

మంత్రి షెకావత్ ‘ఎక్స్’ వేదికగా సోనియా గాంధీని ప్రశ్నిస్తూ.. “ఆ లేఖలను ఎందుకు దాచి ఉంచారు? అందులో ఉన్న రహస్యాలేమిటి?” అని నిలదీశారు. ఎంతో ముఖ్యమైన చారిత్రక ఆధారాలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం సరికాదని ఆయన అన్నారు. అంతకుముందు నెహ్రూ లేఖల ఆచూకీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీలు ప్రభుత్వంపై చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *