ఆంధ్రప్రదేశ్ రైతులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీపి కబురు అందించారు. వచ్చే సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా గతంలో భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు ప్రాధాన్యతనిస్తూ ఈ పుస్తకాలను అందజేయనున్నారు.
గత ప్రభుత్వం హయాంలో జారీ చేసిన పాసుపుస్తకాలపై మాజీ సీఎం జగన్ బొమ్మ ఉండటాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తప్పుబట్టింది. ఎన్నికల హామీలో భాగంగా, ఆ బొమ్మను తొలగించి ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పుస్తకాలను ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే పాసుపుస్తకాలలో ఎలాంటి తప్పులు లేకుండా, సమాచారం కచ్చితంగా ఉండేలా అధికారులు ప్రతి పుస్తకాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీ ప్రక్రియ కారణంగానే జారీలో కొంత ఆలస్యం జరిగిందని, సంక్రాంతి నాటికి రైతులకు ఇవి చేరుతాయని మంత్రి స్పష్టం చేశారు.
పాసుపుస్తకాల పంపిణీతో పాటు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. భూముల రీ-క్లాసిఫికేషన్కు సంబంధించి వచ్చిన లక్షకు పైగా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్లకు సూచించారు. ఎవరైనా ప్రైవేట్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, వాటిని రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తామని వెల్లడించారు. పాసుపుస్తకాలు అందే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు పాత పుస్తకాలు లేదా ఇతర ఆధారాలు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.