ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌లో హనుక్కా పండుగ సందర్భంగా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, భారత నిఘా వర్గాలు (ఐబీ) దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. ఐసిస్ తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైన తండ్రీ కొడుకులు (సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్) ఈ దాడికి పాల్పడటం, ఈ నిందితులు భారత పాస్‌పోర్టులు వాడినట్లు తేలడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఐసిస్ అనుబంధ గ్రూపులు ఆన్లైన్లో యువతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని కూడా ఉగ్రవాద సంస్థలు నియామకాలకు ఒక సాధనంగా వాడుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత నిఘా సంస్థలు, భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు సూచించాయి. నూతన సంవత్సర వేడుకలకు భారీగా జనం తరలివచ్చే గోవా వంటి పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశాయి. పోలీసులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని, అందుకే అత్యంత అప్రమత్తత అవసరమని ఒక సీనియర్ అధికారి తెలిపారు.