హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మరోసారి దూకుడుగా స్పందిస్తూ, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ వంటి అంశాలపై గతంలో దృష్టి సారించిన ఆయన, ఇప్పుడు వృద్ధుల సంక్షేమంపై దృష్టి సారించారు. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలేయడం అనేకసార్లు చూశానని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మం అని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సాకులకు, సమర్థనలు పని చేయవని తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలని ఆయన గట్టిగా హెచ్చరించారు: “ఈ రోజు మీ తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరే.. మీ పిల్లలకు పాఠం అవుతుంది. నేడు మీరు మీ పిల్లలకు ఏం నేర్పుతారో.. రేపు మీ వృద్ధాప్యంలో మీరు అదే అనుభవిస్తారు“.
“ఇకపై వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదు. కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు” అని సీపీ హెచ్చరించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లిదండ్రులకి పోలీసుశాఖ అండగా ఉంటుందని, బాధితులు నిర్భయంగా నేరుగా సంప్రదించవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.