తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి విద్యార్థులకు భారీ శుభవార్త వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలు చేస్తున్న తరహాలోనే, టీటీడీ నిర్వహించే ఎస్వీ జూనియర్ కళాశాలలు మరియు ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలల్లో చదివే డేస్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సమావేశం అనంతరం ఈ నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు, టీటీడీ ఆధ్వర్యంలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌లు మరియు అవసరమైన సిబ్బంది నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న 2100 సీట్లకు అదనంగా 270 సీట్లు పెంచాలని నిర్ణయించారు.
విద్యార్థులకు సంబంధించిన నిర్ణయాలతో పాటు, భక్తుల సౌకర్యమే లక్ష్యంగా టీటీడీ పాలకమండలి మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించాలని తీర్మానించింది. అంతేకాకుండా, తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్లకు శ్రీవారి నామాల పేర్లను పెట్టాలని నిర్ణయించి, ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.