సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాలయాపన చేస్తుంటారు. కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, కందికట్కూరు గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ చింతపల్లి విజయమ్మ మాత్రం తన నిజాయితీని చాటుకున్నారు. ఎన్నికల ప్రచారంలో తాను గెలిస్తే గ్రామంలోని కోతుల సమస్యను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఆమె మాట నమ్మి భారీ మెజారిటీతో గెలిపించారు.
సర్పంచ్ గా గెలిచిన మరుసటి రోజే విజయమ్మ సంబరాల్లో మునిగిపోకుండా, సొంత నిధులతో రంగంలోకి దిగారు. కోతులను పట్టే నిపుణులను గ్రామానికి రప్పించి, గ్రామంలోని వివిధ వీధుల్లో తిరుగుతున్న సుమారు 100కు పైగా కోతులను చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుకున్న కోతులను సురక్షితమైన బోన్లలో బంధించి, గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా దూరంగా ఉన్న దట్టమైన అడవిలో వదిలిపెట్టేలా ఆమె చర్యలు తీసుకున్నారు.
తన చిన్నపాటి హామీని కూడా ఇంత చిత్తశుద్ధితో నెరవేర్చడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ అంటే ఇలా ఉండాలని, మాట తప్పని నాయకురాలు అంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా విజయమ్మను కొనియాడుతున్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడమే కాదని, ప్రజల నిత్యజీవిత సమస్యలను పరిష్కరించడం కూడా అని ఆమె నిరూపించారు. కోతుల సమస్య తీరడంతో గ్రామస్తులు ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు.