సిడ్నీ ఉగ్రదాడి నిందితుడిది హైదరాబాదే: 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వలస, డీజీపీ సంచలన ప్రకటన

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్ వద్ద యూదుల పండుగ సందర్భంగా జరిగిన ఘోర ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు సాజిద్ అక్రమ్ (50) హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ధృవీకరించారు. ఈ దాడిలో 16 మంది మరణించగా, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. సాజిద్ పక్కా హైదరాబాద్ నివాసి. ఇక్కడ అతను బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) డిగ్రీ పూర్తి చేశాడు. అతని తండ్రి గతంలో రక్షణ రంగంలో పనిచేశారు, సోదరుడు ప్రస్తుతం పాతబస్తీలో వైద్యుడిగా పనిచేస్తున్నారు.

సాజిద్ అక్రమ్ 1998 నవంబర్‌లో పైచదువుల నిమిత్తం విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. అక్కడ ఒక యూరోపియన్ యువతిని వివాహం చేసుకున్న అతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారంతా ఆస్ట్రేలియా పౌరులే అయినప్పటికీ, సాజిద్ మాత్రం ఇప్పటికీ భారత పాస్‌పోర్టునే వినియోగిస్తుండటం గమనార్హం. ఆస్ట్రేలియా వెళ్ళాకే అతను ఐసిస్ (ISIS) వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెంచుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ పోలీసులు సాజిద్ గత 27 ఏళ్ల చరిత్రను తవ్వితీశారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో సాజిద్ కేవలం ఆరుసార్లు మాత్రమే ఇండియాకు వచ్చాడని, చివరిగా 2022లో హైదరాబాద్‌ను సందర్శించాడని డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అతనిపై ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు వెల్లడించారు. అతని కుటుంబ సభ్యులకు ఈ ఉగ్రవాద చర్యల గురించి తెలియదని, చాలా కాలంగా వారితో సంబంధాలు తక్కువగా ఉన్నట్లు చెప్పారు. సాజిద్‌కు సంబంధించి మరిన్ని అంతర్జాతీయ సంబంధాల గురించి ఆస్ట్రేలియా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని డీజీపీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *