అమెరికాలోని మిచిగాన్‌లో నివసిస్తున్న 88 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ వెటరన్ ఎడ్ బాంబస్, తన భార్య వైద్య ఖర్చుల కోసం తన పెన్షన్, పొదుపుతో సహా సర్వస్వం ఖర్చు చేశారు. అయినప్పటికీ తన భార్య ఆరోగ్యం కుదుటపడకపోవడంతో, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆయన, ఆ వయసులో గత ఐదు సంవత్సరాలుగా ఒక సూపర్‌మార్కెట్‌లో రోజుకు 8 గంటల చొప్పున పనిచేయడం ప్రారంభించారు.
ఎడ్ బాంబస్ పడుతున్న కష్టాన్ని ఆస్ట్రేలియన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శామ్యూల్ వైడెన్‌హోఫర్ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ వీడియోకు కోటికిపైగా వ్యూస్, 3 లక్షల లైక్‌లు రావడంతో, ఆయన కథనం లక్షలాది మంది హృదయాలను కదిలించింది. వెంటనే శామ్యూల్, ఎడ్ బాంబస్ కోసం ఒక గోఫండ్‌మీ (GoFundMe) పేజీని ప్రారంభించారు.
ఈ గోఫండ్‌మీ పేజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అసాధారణ మద్దతు కారణంగా, కేవలం కొద్ది కాలంలోనే 1.7 మిలియన్ డాలర్లు (మన భారత కరెన్సీలో ఏకంగా రూ. 15 కోట్లకు పైగా) విరాళాలు సేకరించారు. ఈ భారీ విరాళాల వెల్లువ కారణంగా, ఆ రిటైర్డ్ ఆర్మీ వృద్ధుడు ప్రస్తుతం సూపర్‌మార్కెట్‌లో చేసే పనిని వదిలివేసి, తన జీవిత చరమాంకంలో దక్కాల్సిన గౌరవప్రదమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతున్నారు.