గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘NBK111’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా, బాలయ్య అభిమానులకు మరింత కిక్ ఇచ్చేలా మరో వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ మూవీలో ఒక పాటను స్వయంగా బాలకృష్ణే పాడనున్నారు.
ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక ఈవెంట్‌లో కన్ఫర్మ్ చేశారు. బాలకృష్ణ పాడబోయే ఈ పాట ‘బాహుబలి’ సినిమాలో దలేర్ మెహందీ పాడిన ‘సాహోరే బాహుబలి’ తరహాలో ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటుందని తమన్ అప్‌డేట్ ఇచ్చారు. బాలకృష్ణ గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమాలో ‘అరె మామా ఏక్ పెగ్‌లా’ అనే పాట పాడి అప్పట్లో ట్రెండ్‌ను సృష్టించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన పాట పాడుతుండడంతో అభిమానులలో ఉత్సాహం రెట్టింపైంది.
‘NBK111’లో బాలయ్య పాటతో పాటు, మిల్కీ బ్యూటీ తమన్నాపై ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలకృష్ణ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండగా, ఆమె పవర్ ఫుల్ రాణి లుక్‌ను కూడా ఇటీవల రివీల్ చేశారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాను గత చిత్రాల కంటే డిఫరెంట్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.