ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి నిడిగట్టు సంజయ్‌కుమార్కు ఎట్టకేలకు ఊరట లభించింది. దాదాపు 112 రోజుల క్రితం అరెస్టు అయిన సంజయ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీ సీఐడీ అదనపు డీజీగా, అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు.
అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో అగ్ని-ఎన్‌వోసీ వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి కాంట్రాక్ట్‌లో అవకతవకలకు పాల్పడ్డారని, పని పూర్తి కాక ముందే రూ. 59 లక్షలకు పైగా చెల్లింపులు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, సీఐడీలో ఎస్పీ, ఎస్టీ అవగాహన కార్యక్రమాలకు సంబంధించి షార్ట్ టెండర్లు, రూ. 1.15 కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో సీఐడీ చీఫ్‌గా ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సంజయ్‌ను వెయిటింగ్ ఫర్ పోస్టింగ్‌లో ఉంచారు. ఆ తర్వాత 2024 డిసెంబర్‌లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా ఆయన్ని సస్పెండ్ చేశారు. 2025లో ఏసీబీ కేసు నమోదు చేసి, అరెస్టు చేసింది. ఆయన సస్పెన్షన్ మరో ఆరు నెలలు (మే 2026 వరకు) పొడిగించబడినప్పటికీ, ఇన్నాళ్లకు బెయిల్ లభించడంతో ఆయనకు తాత్కాలిక ఊరట దొరికినట్లయింది.